అదేదో సినిమాలో ఒక ప్రముఖ హీరోది ఒక కామెడీ డైలాగు ఉంది... హీరోయిన్ ఎదో మాయ రోగం వచ్చింది అని, తను ఎదో ఆకు పసర వైద్యం ఎదో తీసుకుంటుందని... "గోరింటాకు, పిప్పింటి ఆకు, బలుసాకు, బచ్చలాకు, ఉలింద్రాకు, ఉమ్మెత్తాకు, జమ్మాకు, జామాకు, తంగెడాకు, తమలపాకు... ఇలా అన్ని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున రెండు నెలలు వాడితే తగ్గిపోతుంది అని చెప్పారన్నా".
నేను ఏ విషయం గురించి చెప్తున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది ఈపాటికి. "సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు వాడితే తప్పేంటి?" అనొచ్చు మీరు. ఉచితము, హానికరం కానంత మాత్రాన అది ఔషధం అవ్వదు. ఉబ్బసం వఛ్చిన వాళ్లకి ఇదివరకు చేప మందు అని ఇచ్ఛే వాళ్ళు. ఇది మందు ఎలా అవుతుంది అని కోర్టుకు వెళ్తే దాన్ని చేప "ప్రసాదం" అని ఇవ్వటం మొదలు పెట్టారు. జనాలని educate చేసే పని మాత్రం చెయ్యరు.
ఆధునిక వైద్యమే తన ప్రోటోకాల్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ దగ్గర నుంచి, ప్లాస్మా తెరపీ దగ్గర నుంచి, నిన్న మొన్నటి రెమెడీస్వెర్ వరకు ఎప్పటికప్పుడు పని చెయ్యని విధానాల్ని వదులుకుంటుంది.
ఇక మందు కనిపెట్టాం అని చెబితే ఎక్కడ బొక్కలో వేస్తారని ఎవరికి వారు వైద్యుల అవతారం ఎత్తారు. అల్లం బెల్లం, ఉల్లి వెల్లుల్లి, రక రకాల కాషాయాలు చివరకు జంతువుల మల మూత్రాలు కూడా తింటే తాగితే ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది అని డబ్బారాయుళ్లు మొదలయ్యారు.
విషయం ఏంటి అంటే... నువ్వలుండలు తిను, మజ్జిగ పులుసు తాగు, వేడి వేడి అన్నంలో మెంతి ఆవకాయ తిను, అలాగే ఇడ్లీ తిను, దోరగా roast చేసిన ఉల్లి పెసరట్టు తిను, ఉప్పు కారంలో వేయించిన జీడిపప్పు తిను, పచ్చి ఉల్లిపాయ ketchup వేసుకొని boiled egg తిను, బిర్యాని తిను. ముద్దపప్పు ఆవకాయ తిను, గుత్తి వంకాయ మసాలా తిను, అప్పడాలు నంజుకుంటూ పప్పుచారు తిను. ఆరోగ్యాంగా ఉండటం కోసం సమతుల్య ఆహారం తీసుకోని, సరిపడా వ్యాయామం చేసి, కాసేపు ఎండలో కూర్చొని... కావాల్సిన నీళ్లు తాగి, హాయిగా నిద్రపో... ఆ విషయంలో ఎవరికి పేచీ ఉంటుంది? ఏదైనా మితం ఉత్తమం.
పేచీ అల్లా ఇవి తింటే ఏ రోగం రాదు అని సోది కబుర్లు చెబితేనే!
నిమ్మకాయ నీళ్ల సార్లు, కొబ్బరి నూనెల సార్లు, చిరు ధాన్యాల సార్లు, చిన్నఉల్లిపాయల సార్లు, అల్లం బెల్లం సార్లు ... ఈ సార్ల పని చాలా సులువు. మార్కెట్లో ఏ కొత్త జబ్బు వచ్చినా నిమ్మకాయ నీళ్ళుతో పాటు ఏదో ఒక వైద్యం చెప్తారు. కరోనా అయినా black fungus అయినా ఒకటే కొట్టుడు, కలిపి కొట్టారా కోవేటి రంగా!
హృదయ కాలేయం లో మా సంపూర్ణేష్ అన్న ఎప్పుడో కనిపెట్టాడు! తేనే, నిమ్మరసం, యాపాకు ఆయుర్వేదిక వనమూలికలు కలిపి కారు చౌకగా computer చెయ్యొచ్చు. అదే కొద్దిగా కర్పూరం కలిపి కంట్లో పోసుకుంటే సమ్మలోరి కెల్ల, కరోనాతో పకోడీ వండుకోవచ్చు. కారు చీకట్లో కాంతి రేఖ అని, భారతీయ విజ్ఞానం పేరుతో ఇలాంటి placebo లు ఇవ్వటం మాత్రం ఆపరు.
ఆధునిక వైద్యం మీద నమ్మకం లేక, రోజుకో రకం మారుతున్న వైద్యం పట్ల అవగాహన పెంచుకోలేక, ఖర్చులు తట్టుకోలేక, ప్రభుత్వ అసమర్థతని ప్రశ్నించలేక. ఇలాంటి నాటు వైద్యం, ఇంటి వైద్యం, భూత/ప్రేత వైద్యం వైపు వెళ్తున్న అమాయక ప్రజల్ని చూస్తుంటే నాకు ఒక ముతక సామెత గుర్తుకు వస్తుంది... "ఏరు మీద అలిగి, ముడ్డి కడుక్కోటం మానేసాడు అంట ఒకడు".
No comments:
Post a Comment