శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు అనే శక్తి నిత్యత్వ సూత్రాన్ని తరగతి గదిలో చదువుకొని, ఇంటికొచ్చి మా దేవుడు అన్ని సృష్టిస్తాడు అనే నమ్మకాన్ని వంటబట్టించుకుంటారు.
జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరీక్షల కోసం చదువుకొని, సృష్టికి మూలం మాసాములోరు అని భజనలు చేస్తారు. సౌరకుటుంబం గురించి సారుకోసం చదువుకొని ఇంటికొచ్చి కర్ణుడు సూర్యుని కుమారుడు, ఇది నిజం అంటారు .గ్రహణం అనేది కేవలం భూమి నీడే అనే పాఠం జాగ్రత్తగా బట్టీ పట్టి, ఇంటికొచ్చి తలస్నానం చేసి ఉపవాసం ఉంటారు.
వాస్తవాల ఆధారంగా ఉన్న భౌతిక జ్ఞానాన్ని ఉద్యోగం కోసం మాత్రమే చదువుకొని, ఊహలు కల్పితాలు ఆధారంగా తయారు చేసుకున్న అభౌతిక జ్ఞానం వెంట మిగతా జీవితం అంతా గడుపుతారు. అదేమంటే ఈ ఊహలే అసలైన జ్ఞానం అంటారు!
పరిణామ సిద్ధాంతాలు, సాపేక్ష సిద్ధాంతాలు పాశ్చాత్యులు చెప్పిన విద్య, మన విద్య వేరు అని ప్రవచనాలు చెప్తారు. మరి వాడుతున్న సౌకర్యాలు అన్ని వీటి నుండి పుట్టినవే కదా అంటే? ఆబ్బె అవి లేకుండా మా పూర్వికులు వెయ్యేళ్ళు బ్రతికారు అని డంబాలు పోతారు. సౌకర్యాలతో సుఖాలు వస్తాయి గాని సంతోషాలు కాదని పిడివాదం చేస్తారు కానీ కొత్త విషయాలు కనుగొనే మార్గాలు మాత్రం అన్వేషించరు.
చదువులు ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం కోసం అనే విషయం మర్చిపోయి... ప్రశ్నించి తర్కించటం మానేసి ఊహల్ని కవిత్వాల్ని నమ్మకాలని విశ్వాసాల్ని వంటబట్టించుకొని పతనం వైపు పరుగులు తీస్తారు.
ఒక్కవిషయం ఆలోచించండి?
1810 లో కొన్ని సమాజాలు "ప్రతి ఇంటికి మెరుగైన విద్యుత్తు సరఫరాని ఎలా చేయగలం?" అనే విషయంలో తర్జన భర్జన పడుతుంటే, మన సమాజంలో మన తాతలు వారి కులానికి చెందిన రాములోరి ఆలయంలో టెంకాయలు కొట్టి వర్షాలు పడితే చాలు అని దండాలు పెట్టుకొన్నారు. ఏనాడూ తాము దండం పెట్టుకోటానికి వర్షానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించుకోలేదు.
1850 ల్లో టీకా మందుల వల్ల రాబోయే కాలంలో బిడ్డలకు రోగాలు రాకుండా ఎలా తగ్గించగలం అని కొన్ని సమాజాలు తీవ్రంగా కృషి చేస్తుంటే... సమశీతోష్ణ వాతావరణంలో ఉన్న మన సమాజంలో మన బాబాయిలు మామయ్యలు దోమలవల్ల సోకె మలేరియా లాంటి సాధారణ వ్యాధులు వస్తే వైద్యం తెలీక అవి పూర్వజన్మ ఫలితాలు అని నమ్మి వేప మండలంతో కొట్టించుకున్నారు. అది పనిచేయక చచ్చిపోతే "ప్రాప్తం" లేదని సర్ది చెప్పుకున్నారు కానీ, ఏమిటీ మార్గం అని ఆలోచించలేదు.
ఏదైనా ఒక విషయం "ఎందుకు" జరిగింది అని అన్వేషిస్తే సమాధానం వస్తుంది కానీ, "అది అలా సృష్టించబడింది కాబట్టి" అని సర్ది చెప్పుకునే వాడికి వాస్తవం ఎప్పటికీ అర్థం కాదు. నమ్మకాలు ఊహలు ఉపశమనాన్ని కలిగిస్తాయి కానీ అవి ఎప్పటికీ వాస్తవాలు కావు.
700 కోట్ల జనాభా మన భూప్రపంచం మీద ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత మంది ఉండలేదు. మారుతున్న పరిస్థితులు మారుతున్న పరిణామాలు పట్టించుకోవటం మానేసి, కార్యా కారణ వివేకం కోల్పోయిన ఈ విద్యార్థులు ఎప్పటికైనా మేలుకుంటారా? కథలు ఊహల్లోనుంచి వాస్తవంలోకి ఎప్పటికి వస్తారు?
"మెదడన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశదమగు విశ్వరహస్యాలు"
-- శ్రీశ్రీ