Sunday, February 26, 2017

కట్టు బానిసత్వం

"ఇది విన్నావా? వారి ఆదాయం ఎంతో తెలుసా? "
"తెలీదు. 2-3 వందల కోట్లు ఉంటుందేమో "

"పోయిన సంవత్సరం 2,262 కోట్లు"
"పర్యాటక ప్రదేశం కదా, భక్తులు ప్రసాదాలు, స్పెషల్ దర్శనాలు, తల వెంట్రుకలు, కాటేజిలు అవి ఉంటాయి కదా. ఆ మాత్రం ఆదాయం వస్తుందిలే."
"ఒక్క హుండీ ఆదాయం 1100 కోట్లు. "

"ఈ దేవుడు ఆ దేవుని దగ్గర చేసిన అప్పు తీరాలి కదా. కనీసం ఈ కలియుగాంతంకైనా తీరుతుందో లేదో. "
"ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గర అప్పు తీసుకుంటే... దానికి వీళ్లకు ఏంటి సంబంధం? "
"!!"
"అప్పు ఇచ్చిన దేవుడి బ్యాంకు అకౌంట్ ఏంటి, మంత్లీ EMI ఎంత, ఎన్ని సంవత్సరాలు కట్టారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు కట్టాలి? "

"బోడి గుండు మీద వెంట్రుకలు పీకే పని చేయక, ఆలా మాట్లాడితే కళ్ళు పోతాయి. ఆపద మొక్కులవాడు, అనాధ రక్షకుడు. కోరికలు తీరిన భక్తులు మొక్కు తీర్చుకుంటారు"
"సరే తీరినవాళ్లు వాళ్ళ సంతోషం కొద్దీ ఇచ్చారు అనుకుందాం. మరి తీరని వారికి ఏమైనా లయబిలిటీ ఇస్తారా?"
"అదెలా కుదురుతుంది, ఎవరేం పాపం చేసుకున్నారో? చేసిన కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే కదా? "
"తెలిసి ఏ తప్పులు చేయకపోతే?"
"పూర్వ జన్మలో కొన్ని తెలిసి చేసిన తప్పులు అయ్యుండొచ్చు కదా? "
"బాగుంది, అంటే పెట్టుబడి (capital) లేదు, ఉత్పత్తి (production) లేదు, distribution లేదు, కానీ ఆదాయం (revenue) మాత్రం ఉంది. మంచి జరిగితే credit, లేకపోతె నీ (ఖ)కర్మ."

"అంటే అందరు పుణ్యం పాపం చేసినప్పుడే కాదు, కొంత మందికి కులదైవం. ఇంట్లో ఆచారంగా ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం కొండకు వెళ్లి అందరిని చల్లగా చూడు స్వామీ అని ఏమీ ఆశించకుండా హుండీలో డబ్బులు వేస్తుంటారు"
"వీళ్ళు ఇంకా ఘోరం, కట్టు బానిసలన్నమాట!"

"ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి! అయినా ఇచ్చేవాళ్లకు లేని బాధ నీకెందుకు? "
""

Friday, February 24, 2017

నేనెవరు?


కరి నువ్వే మకరి నువ్వే
తేరు నువ్వే పోరు నువ్వే
ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే
కృష్ణుడు నువ్వే అర్జునుడు నువ్వే
                   --- సిరివెన్నెల

కరి = ఏనుగు
మకరి = మొసలి
తేరు = రథం
పోరు = యుద్ధం

ఈ బ్లాగు రాసింది మాత్రం నేను, చదివింది నువ్వు :). సిరివెన్నెల గారు చెప్పింది చదివితే అర్థం అయ్యే విషయం కాదు. సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం.

ఈ మధ్య అమెరికాలో "Goat Yoga" అని వచ్చింది. అంటే ఏమీ లేదు, వీళ్ళు ఆసనాలు వేస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లని వీళ్ళ మీద నించోపెడతారు...ట! ఆసనానికి గొర్రెకి సంబంధం ఏమిటో ఆ గొర్రె మందకే తెలియాలి.

అలాగే జర్మనీలో "Beer Yoga" అని మొదలెట్టారు. మత్తులోకి జోగాక సమాధి స్థితి అనుభవిస్తారన్నమాట.

కాబట్టి మిత్రులారా, ఈ సన్నాసులందరు మీ ఇంటి తలుపులు కొట్టక ముందే, మీరెళ్ళి గురువుగారి కాళ్ళు పట్టుకోండి. మీకోసం కాకపోయినా రేపు మీ పిల్లలకో, లేక పిల్లల పిల్లలకో (అప్పటికి మీరింకా ఉంటే) బుద్దిపుడితే 'అమ్మా... నాయనా... ఇదీ సరైన దారి" అని ఒక సలహా ఇచ్చి మీ పెద్దరికం నిలబెట్టుకుందుకైనా పనికి వస్తుంది.

Thursday, February 23, 2017

రెటమతం!

మా కజిన్ చెప్పిన సంఘటన ఇది. చిన్నజీయర్ గారు ఒక చోట బాలాజీ temple opening పని మీద వచ్చినప్పుడు... గుడి ముందు ఉన్న వినాయకుడిని తీయించి విశ్వక్సేనుడిని ప్రతిష్టించేవరకు program postpone చేయించారు. ఇరవయ్యోకటో శతాబ్దంలో శైవం, వైష్ణవం అని తన్నుకోవటం ఏంటి అని ఆయన(కజిన్) ఆవేదన. నాకు కూడా అది నచ్చలేదు, అదే టైంలో దశావతారం సినిమా చూసిన impact కూడా ఉంది.

ఇంకా, ఇక్కడ కొన్ని చిన్నజీయర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కొన్ని పూజలకు వెళ్లాను. దేవుళ్లలో ముక్తి ఇవ్వగలిగేది కేవలం నారాయణుడు మాత్రమే అని వారి నమ్మకం. మిగతా దేవుళ్ళవి limited powersట. నాకది అర్థం కాలేదు. అదేవిషయం అడిగితె City Mayor power vs President power అని ఒక comparison చెప్పారు. అలా ఆ విషయాన్ని పక్కన పెట్టాను.

తరువాత ఇంకో విషయం అర్థం అయ్యింది. నువ్వు వేరు భగవంతుడు వేరు అని ఒక సిద్ధాంతం (Category A), నువ్వు భగవంతుడు ఒకటే అని ఒక సిద్ధాంతం (Category B). ఈ రెంటిని mix చేసి ఇంకో సిద్ధాంతం ఉన్నాయి అని. ఈ మూడూ అన్ని మతాల్లో ఉన్నాయి. "Kingdom of heaven is within you" అని బైబిల్లో ఉంది.

నేను భగవంతుడు వేరు అనుకున్నవాడు, భగవంతుడిని రక్షించే పనిలో ఉంటున్నాడు. ఒక రకంగా వ్యాపారం చేస్తున్నాడు. ఎదో ఒకరకంగా భగవంతుడిని మెప్పించి తద్వారా లాభం పొందాలి. తాత్కాలికం - ఇల్లు, పెళ్లి వగైరా; దీర్గకాలికం - స్వర్గలోక ప్రాప్తి, 72 కన్యలు (ఆడో మగో తెలీకపోయినా).

మతం పేరుమీద జరిగే అరాచకాలన్నీ Category A వల్లనే. Category B వల్ల ఇబ్బందేమీ లేదు. ప్రతిమతం వేరే మతంలో ఉన్న Category A చేసే పనులు చూసి వారిమీద ద్వేషం భయం పెంచుకుంటున్నాయి.

Sunday, February 12, 2017

ఐటెం సాంగ్స్

తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంది అని నా అభిప్రాయం. మనసుతో చూడాలి కానీ ప్రతిదాంట్లో ఒక తత్త్వం ఉంటుంది అని మా గురువుగారు చెప్పేవారు.

కృష్ణవంశీ సినిమా  'ఖడ్గం' లో "ముసుగు వెయ్యొద్దు మనసు మీద" అని సిరివెన్నెల గారు రాసిన ఒక పాట... మంచి మాస్ మసాలా డాన్సులు డప్పులు ఉంటాయి... దాంట్లో రెండో చరణం ఇలా సాగుతుంది

"కొంతకాలం నేలకొచ్చాం అతిదులై ఉండివెళ్లగా
కోటలైనా గొప్పలైనా ఏవి స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా

నిన్న ఏమైందో గుర్తుకొస్తే తీపి అనిపించని
ఉన్న స్వప్నాలు గుండె నిండా సరదాలు పండించని
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం "

https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk

బ్యాక్ గ్రౌండ్ స్కోరు, డాన్సుల్లో పాటకి తగ్గ అభినయం ఎక్కడుంది అనేదాని గురించి తరువాత మాట్లాడుకుందాం. ఈ పాట మంగళంపల్లి వారి "వస్తా వట్టిదే పోతా వట్టిదే..." కి గాని... అలాగే అన్నమయ్య గారి "నానాటి బ్రతుకు నాటకము" కి గాని ఏమి తీసిపోని భావం. అంటే వారిని అగౌరవపరచటం నా ఉద్దేశ్యం కాదు.

గురువులంటే కాషాయం ధరించి ఆశ్రమంలో కూర్చొని బోధ చేయాలని ఏమి లేదు... ఇలాంటి ఐటెం సాంగ్స్ రాసి కూడా బోధ చేయొచ్చు. కామి కాని వాడు మోక్షగామి కాలేడని యోగి వేమన జీవితం మనకు చెబుతుంది. అర్జునికి కురుక్షేత్ర యుద్ధరంగంలో చెబితేగాని అర్థంకాలేదు.

ఎవరికి ఎక్కడ జ్ఞానోదయం అవుతుందో ఎవరికి తెలుసు? ఏ చేప ఏ గేలానికి పడుతుందో తెలీదు. అవి పడినా పడకపోయినా... గేలం వేస్తూ పోవటమే గురువుల పని. అందుకే కదా మనం ఈ గురువులందరికి ఋణపడి ఉంటాం.