Friday, January 13, 2017

తెలుగు చక్రవర్తి!


అలెగ్జాండర్ ని నిలువరించిన పురుషోత్తం గొప్పవాడు, మౌర్య సామ్రాజ్య అధిపతి అశోకుడు గొప్పవాడు. కానీ మన తెలుగు వారి విషయం ఏంటి? అప్పటి దేశ రాజకీయాలలో మన పాత్ర ఏంటి? ఎంత భారతీయులమైనా ఎంతసేపని పక్కవాడి డబ్బా కొడతాం చెప్పండి?

విజయనగర రాజుల వీరత్వం గురించి విన్నా, కాకతీయుల శూరత్వం గురించి విన్నా, రాయలవారి వైభవం గురించి విన్నా మనసు పూర్తిగా నిండని పరిస్థితి. మిగతా చరిత్ర అంతా విషాదాల మయం. పల్నాటి యుద్దాలు, దాయాదుల పోరులు, దొంగ దెబ్బలు, ఈర్ష్యా ద్వేషాలు, పరాయి పాలన. ఉత్త పుణ్యానికి ప్రాణాలు విడిచిన మన్నెం వీరుడు అల్లూరి.

మనం ఎప్పుడు ఆటలో అరటిపండులా ఉన్నాం అని ఒక నిరుత్సాహం ఉండేది. ఢిల్లీ ఎప్పుడు పాపం మంగోలుల దాడులతో సతమతం అయ్యింది. కృష్ణా గోదావరి డెల్టా లు దాటి ఎవరూ పెద్దగా దాడులు చేయలేదు కాబట్టి మనకు ఎప్పుడు big picture చూసే అవకాశం రాలేదు అనే ఒక నిర్వేదం. మహా అయితే NTR సినిమాల్లో నకుల సహదేవుల పాత్ర అంత చప్పగా ఉంది అని ఒక దురభిప్రాయం.

చరిత్ర భవిష్యత్తుకు పునాది. చెప్పుకోదగ్గ చరిత్ర లేకపొతే చెప్పుకోదగ్గ భవిషత్తు కూడా ఉండదు.

లేదు. మనం కూడా ఏమి తీసిపోము! మనం ఒక పెద్దన్నయ్య పాత్ర పోషించాం అని వింటుంటే ఒళ్ళు ఆనందంతో పులకించిపోయింది! దేశం మొత్తాన్ని ఒక్క తాటి మీదకు తెచ్చి అందరికి ఒకే న్యాయం ఒకే ధర్మం అని చెప్పింది ఒక తెలుగు చక్రవర్తి అని అంటుంటే ఆ ఆనందం ఎలా చెప్పగలను? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 సంవత్సరాల పాటు 'భిన్నత్వం లో ఏకత్వం' పాటించిన నా జాతికి పునాది వేసిన వీర చక్రవర్తి నా తెలుగువాడు.

అప్పట్లో భారతదేశం సరిహద్దులు నాకు అనవసరం. కాశ్మీర్ దాకా వెళ్ళక్కరలేదు అయితే అది మధ్యప్రదేశ్ వరకు వెళ్లాడా, ఉత్తర ప్రదేశ్ వెళ్లాడా నాకు అనవసరం. వింధ్య పర్వతాలు దాటారు, నాకు అది చాలు. ఇవ్వాల్టి సరిహద్దులే ఒక్కొకరు ఒక్కో రకంగా చెప్పుకుంటున్నారు. ఇక 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందొ ఎవడికి తెలుసు.

కానీ ఇది నిజం అని నాకు నమ్మాలని ఉంది.

ఏడు చేపల కథలో రాజులు నేర్చుకోవాల్సిన నీతి ఏంటో వివరంగా కన్న కోడిక్కి చెప్పినా, సమయం లేదు మిత్రమా అని తొందర పెడుతూ దేశం మీసం మెలేసే పౌరుషం చూపించినా, పుట్టింటికి వెళ్తా అని పెళ్ళాం బెదిరిస్తే మీసం సంగతి తరువాత అసలు రోషమే లేని మగడైనా, తల్లిని మించిన తనయుడు ఉన్నాడా అని వితండవాదుల్ని నిలదీసినా, శాంతి కాముకత్వం అంటే చాతకానితనం కాదని యుద్దాలు అవసరం లేని యుద్ధమే దానికి మార్గమని చెప్పి; తొడకొట్టి మరీ చేసి చూపించినా,  "గణ గణ" అంటూ పాట పాడి సైనికుల్ని రాములోరి కల్యాణం చూడటానికి వెళ్తున్నంత సంబరంగా యుద్దానికి ఉత్సాహంగా తీసుకువెళ్లినా... అది తెలుగువాడికి మాత్రమే చెల్లుతుంది. సకలకళా వల్లభులు మరి తెలుగు వాళ్ళే కదా!

కాబట్టి ఇది ముమ్మాటికీ నిజం!

అయ్యా క్రిష్, బాబూ బాలయ్య, మాస్టారు సిరివెన్నెలా, అన్నా సాయి మాధవ్... ఇలాంటి నిజాలు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. నాకు తీపి రుచి ఏంటో ఇప్పుడే తెలిసింది.

No comments: