Monday, November 11, 2019

గోరేటి వెంకన్న!


పరిమితత్వం... సహజత్వం...
సంశయవాదిని

|||||||||||||||||
కంచరేగి తీపివొలే... లచ్చుమమ్మో...
నీ కంఠమెంతా మధురమో... లచ్చుమమ్మో...

పారేటేటి అలలమీద పండుటెన్నెల రాలినట్లు
ఊరే ఊట సెలిమలోనా తేట నీరు ఓనకినట్లు...
వెండి మెరుపులా నవ్వు నీదో... లచ్చుమమ్మో...
నీదెంత సక్కని రూపమొ ... లచ్చుమమ్మో...

మంచెనెక్కి కేక బెడితే, కంచి మేకలు సుట్టూ జెరును
నీ అల్లరిని ఆ లేగ దూడలు వొళ్ళో కొచ్చి ఒదిగిపోవును
పాలిపోయిన కంది సేనే ... లచ్చుమమ్మో...
నీవు పాట పాడితే పూతవెడుతది... లచ్చుమమ్మో...

కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ల కళ్ళాపి జల్లి
ముచ్చటోలుక ముగ్గులేసే మునివేలు గోరుపైన
ఆ పొద్దే ముద్దా గోరింటయితది ... లచ్చుమమ్మో...
పొడ ఎండ నీ మెడ నారమైతది ... లచ్చుమమ్మో...

నీ కాలి అందేలా సవ్వడికి తాబేళ్లు ఇసుకలా గంతులేస్తవి
జాలి గల నీ సూపులతోడేళ్ళు సాదు జీవులైతవి
దారిలో పల్లేరు ముళ్ళే ... లచ్చుమమ్మో...
నీ కాలు మోపితే మల్లెలైతవి ... లచ్చుమమ్మో...
|||||||||||||||||



|||||||||||||||||
ముప్పై ఇండ్లు నిండనేలేదు
మొఖం మీద ముదుతులున్నవి
నలభై ఏండ్లు దాటలేదు
నొసటి పైన గీతాలున్నవి

అదురుష్ట రేఖాలంటారా
బుద్ది జీవులారా
ఆకలి కొచ్చిన గీతాలంటారా

మన్ను ఊడిన మట్టి మిద్దెల
సన్న సీమల పుట్టాలున్నవి
సున్నమూడిన గోడలకు
బల్లిగుడ్లే తెల్లంగున్నవి
సాలె పురుగులు అల్లిన పరదాలే
ఈ పెదవాళ్లకు దేవుడిచ్చిన దోమతెరలాయే
|||||||||||||||||


|||||||||||||||||
ఓ పుల్లా ఓ పుడుకా
ఎండుగడ్డీ సిన్న కొమ్మా
చిట్టి గూడు
పిట్టా బతుకే ఎంతో హాయి

చిగురుటాకు
వగరు పూతా
లేత పిందా
తీపు పండూ
నోటి కందీ చింతా లేకా
కునుకు తీసే
పక్షి బ్రతుకే సౌక్యమోయి

పూటకుంటే అంటే జాలు
రేపు ఎట్లనే ద్యాస లేదు
దాసుకునేటి గుణము లేదు
లోభితనము ఎరుక లేదు
ఈ తత్వ వేత్తలు తరచి చూసిన
నరులకున్న ఈర్ష్య
అణువంతను పిట్టకు లేదు

పావురాయి
రామసీలుక
తీతువమ్మా
గోరువంక
తెల్ల కొంగ
వెడల గువ్వా
నరులు పెట్టిన పేర్లు తప్ప
తమకు ఊరూ పేరే తెలువదు
ఆ పేరు కోసం ఉనికి కోసం
ఈసమంతా ఆరాటం ఎరుగదు

సీకటైతే ఒదిగిపోయి
వేకువాలె నిదుర లేసి
గాలిలోనా ఈదుకుంటా
గగనమంచులా తేలుకుంటా
కొండాకోనలు దాటుకుంటా
కొమ్మ రెమ్మల వాలుకుంటా

ఎల్ల వింతలూ కాళ్ళ జూసిన
తానల్లుకున్న గూటిలకెళ్లి పున్నమి వెన్నెలనే గాంచునా
తానల్లుకున్న గూటిని గూడ పిల్లలేదిగినంక
వల్లనాని ఎల్లిపోతది

సదువు నేర్పే సాలె లేదు
బోధ జేసే గురువు లేదు
ఒణుకుపుడితే ఉడుకు లేదు
రోగమొస్తే మందు లేదు

అన్ని ఉన్నాయన్న నరుడు
ఆశ లోభం ఎంటాడంగా
ఏమి లేని పిట్టా సెంతకు
చేరి జాతకమడుగుతుండు

|||||||||||||||||




|||||||||||||||||

సంత

కాయగూరల తట్ట
ఆకుకూరల కట్ట
తమలపాకుల బుట్ట
తంబాకు పొడిమట్ట
మిరపకాయల ఘాటు
ఉట్టి చాపల సోటు
అల్లమెల్లిపాయ
_____
సంత ముందరి బాట
సాలె బట్టల మూట
అర్రేగు మాలని
అరిసె బతుకు బాట

సంతా మా ఊరి సంత
వారానికోసారి జోరుగా సాగేటి
సంతా మా ఊరి సంత 

సుట్టు ముప్పై ఊళ్ళ 
పెట్టు జనమందరు 
పుట్టబగిలి సీమలొచ్చినట్లు వస్తారు 

సంతా మా ఊరి సంత 

తాగి పెళ్ళాంతోని తగవు పడతాడోకడు 
తాగమని పెళ్ళాన్ని బ్రతిమిలాడుతాడు ఒకడు 
సీర బేరం కాడ సిన్న గొడవ జరిగి అలిగిన పెళ్ళాన్ని అడుక్కొంటాడొకడు 
సంతలో సంసారమంత బైటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటవుతారు 

సంతా మా ఊరి సంత 

ఎండ తాపం చేత ఎగపోసుకుంటోచ్చ్చి 
గోళీసోడాను చూసి కాళ్ళాగి పోతావి 
పట్టుమాని మూరెడు ఎత్తు కూడా లేని
పోరడు సిత్రంగా గోలి సోడా కొడతాడు 
రూపాయికే మంది దూపార్సు కుంటుంటే 
కిన్లీ బిస్లరీ ఏజెన్సీ వోడు బిత్తరయిపోతాడు 

సంతా మా ఊరి సంత 

బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు 
మధ్యాన్నమే కల్లు దుకానానికి వస్తాయి 
కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని 
వియ్యమందానికి తయ్యారయ్యేరు 
సంత కల్లుతోనే పెళ్లి ఖాయం చేసి 
పేరుబలం అడిగేందుకు నేరుగా పొయ్యేరు 

సంతా మా ఊరి సంత 

అమ్మ నాయనల మీద బెంగ బెట్టుకున్న 
అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల 
సరుకుల నెపముతో సంతకంటది వచ్చి 
పుట్టునూరోళ్ళు వస్తే పట్టుకొని ఏడ్సు 
సెల్లెలు తమ్ముని క్షేమమడిగినాక 
అమ్మను రమ్మను అని రాగాలు పెడుతాది 

సంతా మా ఊరి సంత 

కాశీమజిలీ కథలు దాశరధి శతకాలు 
వేమూరి కీర్తనలు యాగంటి తత్వాలు 
అరవయ్యేళ్ళ కింద అచ్చు వేయించిన 
చిరుతొండ ప్రహ్లాద భక్త రామదాసు 
యక్షగానాలన్నీ యాడ దొరుకునో గాని 
బుగ్గ బాలయ్యకు బువ్వ పెడుతుంటాయి 

సంతా మా ఊరి సంత 

సంతనాడు ఊరి డొంకల్లా పాటల్లా 
జంటలు కొన్నేమో జతకూడుకుంటావి 
హద్దులు అదుపులు అన్ని గాలికి వదిలి 
వలచిన మనసులు ఒక్కటే పొతావి 
దూరమైనా గాని ప్రేమ మిగిలీనోళ్లు 
వారం వారం సంత పేరుతొ కలిసేరు 

సంతా మా ఊరి సంత 



























No comments: